కొంత మంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనను హత్య చేస్తామంటూ కొందరు వీడియోలు పోస్ట్ చేశారని వెంకట్ రెడ్డి కంప్లైంట్ లో పేర్కొన్నారు.
ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకును తన అనుచరులు చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. చెరుకు సుధాకర్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. ఇకపై తన అనుచరులు ఉరుకోరని చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్ కు స్వయంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
నేరుగా వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తెలంగాణ ఉద్యమకారులు భగ్గుమన్నారు. తమను హత్య చేస్తామని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుహాస్ పోలీసులతో పాటు మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాడు.