మన దేశంలో పెళ్లి చేయడం అంటే.. అదొక భారీ కార్యక్రమం అనే చెప్పాలి. పెళ్లి సందర్బంగా హడావిడి నెలకొంటుంది. ప్రజలు సంతోషంగా గడుపుతారు. అలాగే పెళ్లి కుమార్తెను సాగనంపేటప్పుడు ఆమె, ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. అయితే అక్కడ కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కాకపోతే అది విషాదంగా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఒడిశాలోని బినికా బ్లాక్ జులుందా గ్రామానికి చెందిన మురళీ సాహూ, మేనక అనే దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూ (రోజీ)కి, తెంతులు గ్రామానికి చెందిన బిసికేశన్ ప్రధాన్‌కు అక్కడి సోనెపూర్‌లో వివాహం జరిగింది. అయితే అప్పగింతల కార్యక్రమం అయ్యేటప్పుడు గుప్తేశ్వరి బాగా ఏడ్చింది. ఎంతలా ఏడ్చిందంటే.. ఆ ఏడుపుకు ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. కానీ చుట్టూ ఉన్నవారు ఆమె ఏడుపు వల్ల సొమ్మసిల్లి పడిపోయిందని అనుకున్నారు. ఆమె ఎంతకూ లేవకపోవడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.
అయితే హాస్పిటల్‌లో గుప్తేశ్వరిని పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని, కార్డియాక్ ఫెయిల్యూర్ వల్ల ఆమె చనిపోయిందని, విపరీతమైన ఒత్తిడితో నిరంతరాయంగా ఏడవడం వల్లే అలా జరిగిందని వైద్యులు తెలిపారు. కాగా ఇలా జరగడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రి ఇటీవలే మృతి చెందగా తల్లి దగ్గరుండి పెళ్లి చేసింది. అయితే ఆమెను వదిలి ఉండలేకే గుప్తేశ్వరి అంతలా బాధపడి ఏడ్చిందని స్థానికులు తెలిపారు.