కాసేపట్లో పెళ్ళి. స్నేహితులు, చుట్టాలు, శ్రేయోభిలాషులు,ఇరుగు పొరుగు పెళ్ళిపందిరి కళకళలాడుతోంది. పెళ్ళికూతురి చేయిపట్టేందుకు బ్యాండ్ బాజాతో వరుడు విచ్చేసాడు.అలాంటి శుభ తరుణంలో అశుభం చోటుచేసుకుంది. పెళ్ళింట ఏది జరక్కూడదో అదేజరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి చెందింది. అక్కడున్నవాళ్ళకి గుండెపగిలే వార్త. దీంతో వివాహావేదిక విషాదమయంగా మారింది.
ఈ సమయంలో వధువు కుటుంబసభ్యులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని..మృతి చెందిన కుమార్తె స్థానంలో ఆమె చెల్లినిచ్చి వివాహం జరిపించారు. మృత్యువుకి కళ్యాణాన్ని కానుకిచ్చిన ఈ సంఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ లో జరిగింది.
భావ్‌నగర్ జిల్లా సుభాశ్ నగర్‌కు చెందిన జినాభాయ్ రాథోడ్ పెద్ద కుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్ రాణాభాయ్‌తో గురువారం వివాహం జరగాల్సి ఉంది. విశాల్‌భాయ్ ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే హేతల్ స్పృహతప్పి పడిపోయింది.
దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పెళ్లి జరగాల్సిన రోజే నవవధువు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఇంత దయనీయమైన సమయంలో కుటుంబం గుండెరాయి చేసుకుని ఓ నిర్ణయం తీసుకుంది.
మృత్యువు సైతం తలవంచేలా హేతల్ స్థానంలో ఆమె చెల్లిని విశాల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పించింది. దీనికి విశాల్ కుటుంబం కూడా అంగీకరించడంతో.. అదే ముహుర్తానికి ఇద్దరికీ పెళ్లి చేశారు. ఓ వైపు విషాదం,మరోవైపు వివాహంతో చరితలో సరికొత్త పుఠ లిఖితమయ్యింది.