సాధారణంగా పెళ్లికి ముందు వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా, ప్రమాదాల బారిన పడినా.. లేదా ఇరు వర్గాలకు చెందిన కుటుంబాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినా.. సహజంగానే వివాహాలు రద్దు అవుతుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ జిల్లాకు చెందిన ఆ వరుడు మాత్రం ఎవరూ చేయని విధంగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంకొన్ని గంటలైతే వివాహం జరుగుతుందని అనుకుంటుండగా వధువుకు అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. అయినప్పటికీ వరుడు ఆమెను హాస్పిటల్‌లో వివాహం చేసుకుని అసలైన వివాహ బంధానికి అర్థం చెప్పాడు.
యూపీలోని ప్రయాగరాజ్‌కు చెందిన అవధేష్, ఆర్తిల వివాహం మరికొద్ది గంటల్లో జరుగుతుందగా.. ఆర్తి తన ఇంటి పైనుంచి కింద పడింది. దీంతో ఆమె వెన్నెముక, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆమెను హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులు అయితే ఆమె కోలుకుంటుంది. అప్పటి వరకు శరీరాన్ని కదిలించకూడదని వైద్యులు చెప్పారు.
అయితే మరోవైపు వివాహం జరగాల్సి ఉండగా.. ఆర్తికి ఈ విధంగా ప్రమాదం ఏర్పడడంతో ఆమెకు పెళ్లి జరుగుతుందా, లేదా అని ఆమె తరఫు వారు కంగారు పడ్డారు. కానీ వరుడు అవధేష్ ఎలాగైనా సరే అదే ముహూర్తానికి ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఆమె గాయాల నుంచి కోలుకోకపోయినా ఆమెకు జీవితాంతం వెన్నంటి ఉంటానని అతను హామీ ఇచ్చాడు. దీంతో ఇరు వర్గాల అంగీకారం మేరకు హాస్పిటల్‌లోనే వారు వివాహం చేసుకున్నారు. హాస్పిటల్ వారు అనుమతివ్వడంతో వారి వివాహం జరిగింది.
కాగా వివాహం అయిన సందర్భంగా అవధేష్ మాట్లాడుతూ.. ఆమెకు అలా జరగడం తలరాత. అలా జరిగిపోయింది. అయినప్పటికీ ఆమెతో ఉండాలని, ఆమెకు కష్టం వచ్చినా తోడుగా ఉండాలని అనుకున్నా, అందుకే పెళ్లి చేసుకున్నా.. అని చెప్పాడు. వధువు ఆర్తి మాట్లాడుతూ.. నాకు ప్రమాదం జరిగినా నన్ను అతను పెళ్లి చేసుకుంటాను అనే సరికి నాకు ముందుగా భయం వేసింది, అయితే ఆయన నాకు ధైర్యం చెప్పాడు, గాయం నుంచి కోలుకోకపోయినా జీవితాంతం నాతోనే ఉంటానన్నాడు, నాకు చాలా సంతోషం వేసింది, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నా.. అని చెప్పింది. కాగా అతను అలా చేయడాన్ని నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.