తన పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని మేకప్ కోసం ఓ నవ వధువు బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. అయితే అక్కడ చేసిన ఆ ప్రయోగం కాస్తా బెడిసి కొట్టింది. దీంతో ఉన్న నవ వధువు ముఖం వికారంగా మారింది. దీంతో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటూ వరుడు వివాహాన్ని క్యాన్సిల్ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
డీటైల్స్ లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో.. బ్యూటీపార్లర్ కి వెళ్లింది. అక్కడ పని చేస్తున్న ఓ బ్యూటీషియన్.. కొత్త రకమైన మేకప్ వేస్తానని చెప్పింది. ముందు ముఖానికి ఫౌండేషన్ రాసి ఆ తర్వాత ఆవిరి పట్టింది.
ఇది బెడిసికొట్టి ఆ అమ్మాయి ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అలెర్జీ కారణంగా బాధిత యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ పరిణామాలతో పెళ్లి వాయిదా వేశారు అమ్మాయి తరపు బంధువులు. అయితే వధువు ముఖ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆ వరుడు తనకి ఈ పెళ్లి వద్దంటూ కాన్సిల్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.