హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ వంతెన కూలింది. దీంతో ఆ జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
భర్మూర్ గ్రామంలోని లూనా ప్రాంతంలో జాతీయ రహదారి 154ఏ మార్గంలోని వంతెనపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఆ బ్రిడ్జీ పూర్తిగా కూలిపోయింది. దీంతో చంబా-భర్మూర్ జాతీయ రహదారిపై ఇరువైపులా పలు వాహనాలు నిలిచిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కొండచరియలు విరిగిపడటంతో 20 మీటర్ల పొడవైన బ్రిడ్జీ కూలిందని చంబా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఒక కారు, లారీ కూడా లోయలో పడినట్లు తెలిపారు. వంతెన కూలడంతో జాతీయ రహదారి కనెక్టవిటీ పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Bridge Collapse in Chamba, Himachal Pradesh due to Landslide. pic.twitter.com/NogmGhG7Uo
— Kamlesh Kumar Ojha🇮🇳 (@Kamlesh_ojha1) February 5, 2023