ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) దేశంలో గరిష్టంగా 182 రోజుల పాటు ఉండేందుకు వీలు కల్పించిన పాత విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కోరారు.
రోజుల సంఖ్యను 250కి పెంచినా తప్పేమీ లేదని ఆయన అన్నారు. దీని వల్ల దేశం ఏమీ కోల్పోదని ఆయన వెల్లడించారు. దీని వల్ల దేశానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అలా చేస్తే అసాధారణ వ్యక్తులతో భారతీయులు ఎక్కువ సమయాన్ని పొందుతారని చెప్పారు.
ఇది భారత్‌లోని స్టార్టప్‌లపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. కర్ణాటకలోని హుబ్బల్లిలో దేశ్‌పాండే ఫౌండేషన్ 14వ అభివృద్ధి చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… ఎన్ఆర్ఐలు దేశంలో ఉండేందుకు సమయాన్ని 182 నుంచి 120 రోజులకు తగ్గించడం ద్వారా దేశం అదనపు పన్ను రాబడిని పొందలేదని ఆయన పేర్కొన్నారు.
2019-20 వరకు ఎన్ఆర్ఐలు ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజుల కంటే తక్కువ సమయం భారతదేశాన్ని సందర్శించార. అటువంటి సందర్శకుల నుంచి పన్ను ఆదాయం రూ. 15 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఆర్థిక చట్టం- 2020 ఈ వ్యవధిని 120 రోజులకు తగ్గించిందన్నారు.
తూర్పు మధ్య దేశాలు, అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఇతర దేశాల్లో 30 మిలియన్లకు పైగా ఎన్ఆర్ఐలు ఉన్నారని చెప్పారు. దేశానికి మరింత విలువను చేకూర్చే ఎన్నారైలను సహృదయంతో స్వాగతించాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నట్టు చెప్పారు. వారు మనల్ని ఏమీ అడగడం లేదన్నారు.