భారత విద్యావ్యవస్థను బ్రిటిష్ పాలకులు నాశనం చేశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. బ్రిటిష్ పాలనకు ముందు భారత జనాభాలో 70 నుంచి 80 శాతం మంది విద్యావంతులని, నిరుద్యోగమన్నది లేదని ఆయన చెప్పారు. వ్యక్తులు ఒకరిపై ఆధారపడకుండా తమకు తాము అన్నింటా ఎదిగేలా మన విద్యావ్యవస్థ ఉండేదని, వ్యక్తుల కులమతాలు, వారి రంగు వంటివాటిపై విచక్షణ కూడా ఉండేది కాదని ఆయన అన్నారు.
కానీ బ్రిటిషర్లు ఇక్కడ ఇంగ్లాండ్ విద్యా వ్యవస్థను అమలు చేశారని, ఇది మన దేశ విద్యారంగాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. కర్నాల్ లోని ఆరాధనా టెంపుల్ కాంప్లెక్స్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత ఎడ్యుకేషన్ ఎంతో ఉదాత్తమైనది, చౌకయినదిగా ఉండేదని ప్రతివారికీ అందుబాటులో ఉంటూ వచ్చిందని తెలిపారు. ఆ నేపథ్యంలోనే మన విద్యావేత్తలు, ఆర్టిస్టులు, కళాకారులకు దేశ విదేశాల్లో గుర్తింపు లభించిందన్నారు.
దేశంలో విద్యతో బాటు ఆరోగ్య రంగం తీరును కూడా మెరుగుపరచవలసిన అవసరం ఉందని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. ఇవి రోజురోజుకీ ఎంతో ఖర్చుతో కూడుకున్నవిగా మారుతున్నాయని, ఇదే సమయంలో అందరికీ అందుబాటులో ఉండాలని కోరుతున్నానని ఆయన చెప్పారు.