మెడికో స్టూడెంట్ ప్రీతి మృతిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బహుజన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. కాస్త అసహనం వీడండి బ్రదర్.. అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.
తరతరాల అణచివేతకు గురై ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒక డాక్టర్ కావడం తమ లాంటి పేద కుటుంబాలకు మామూలు విషయం కాదని చెప్పారు. ఇలాంటి సంఘటనల వల్ల ఒక తరం వెనక్కి పోతుందన్న ఆయన.. బంగారు స్పూనుతో జన్మించిన మీ బీఆర్ఎస్ దొరలకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ, తమకు కాదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతకుముందు హనుమకొండలో ఏర్పాటు చేసిన సభలో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఆమె మృతికి కారణమైన ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. కాలేజీలో జరిగిన గొడవ వల్ల చనిపోయిన ప్రీతి ఆత్మహత్యను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రీతి చనిపోతే అందరం బాధపడ్డామన్నారు. ఆమెకు అన్యాయం చేసిన వారెవరైనా.. అది సైఫ్ కానీ ఇంకెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నిందితులను తప్పకుండా శిక్షిస్తామని తెలియజేశారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.