వరుసకు తమ్ముడు అయిన వ్యక్తి భార్యపై కన్నేశాడు ఓ కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన సత్యప్రసాద్, లక్ష్మణ్ కుమార్ వరుసకు అన్నదమ్ములు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఉపాధి కోసం బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ తమ్ముడు లక్ష్మణ్ కుమార్ భార్యపై కన్నేసిన సత్యప్రసాద్ తనతో రావాలని కోరాడు. దానికి ఆమె నిరాకరించటంతో లక్ష్మణ్ కుమార్ ను చంపేస్తే తానే వస్తుందని భావించాడు. ఈ నేపథ్యంలోనే దినేష్ అనే కిరాయి హంతకుడితో డీల్ కుదుర్చుకున్నాడు. లక్ష్మణ్ కుమార్‌ను హత్య చేస్తే 15 లక్షలతో పాటు, హైదరాబాద్ లో ఉన్న సొంత ఇంటిని కూడా ఇచ్చేస్తానని కిరాయి మాట్లాడుకున్నాడు.
ప్లాన్ లో భాగంగా దినేష్ తన భార్య సవితకు విషయాన్ని చెప్పాడు. సవిత కూడా లక్ష్మణ్ కుమార్ హత్యలో చెయ్యి కలిపింది. రోజువారి దినచర్యలకు వెళ్తున్న లక్ష్మణ్ కుమార్‌ను గమనించిన దినేశ్ ముఠా, 3వ తేదీన మహదేవపుర వంతెన వద్ద అతన్ని చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపారు. ఆపై అతని సొంత అన్న రాజశేఖర్ కు ఫోన్ చేసి, తమ్ముడు హత్య చేయబడ్డాడని చెప్పి, పరారయ్యారు. రాజశేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు సహకరించిన ముఠాను, సూత్రధారుడు సత్య ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.