అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ కంపెనీపై దర్యాప్తు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లెమెంట్ లో ఇవాళ ఉభయసభల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
రూల్ 267 కింద రాజ్యసభలో చర్చ చేపట్టాలని ఛైర్మన్ ధన్ కర్ ను ఎంపీ కేశవరావు కోరారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి.. అదానీ పై జేపీసీ వేయాలన్న అంశాన్ని చర్చించాలని ఆయన తన లేఖలో తెలిపారు. ఇక లోక్ సభలోనూ.. ఇదే అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు.
ప్రశ్నోత్తరాలను నిలిపివేసి అదానీ అంశంపై చర్చ చేపట్టాలని ఆయన తన వాయిదా తీర్మానంలో కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు చెందిన రెండో దఫా సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో తొలి రోజు కూడా బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు.
అదానీ వ్యవహారంపై చర్చించాలని లోక్ సభ, రాజ్య సభలోనూ కోరారు. ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.