ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. దీంతో ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.
ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఢిల్లీ తెలంగాణ భవన్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇటీవల కేసీఆర్ కుటుంబం నుంచి ఒక వికెట్ పడుతుందంటూ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ చర్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కావాలనే కుట్రపూరితంగా ఆందోళనలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.
మరో వైపు కవితకు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిపై బై..బై మోడీ అని రాశారు. ఆరోపణలు ఎదుర్కొనే వారు బీజేపీలో చేరగానే.. ఆరోపణలన్నీ పోతాయని ఆ పోస్టర్లలో సెటైర్లు వేశారు.