– పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా తెలంగాణ రాజకీయం
– మోడీ సభకు బీజేపీ భారీ ప్లాన్!
– ఫిబ్రవరి 13న తెలంగాణకు పీఎం
– మోడీ కౌంటర్ సభకు కేసీఆర్ ప్లాన్
– ఒకే స్థలంలో పేలనున్న పంచ్ లు
– ఇటు.. రిపబ్లిక్ డే వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో లేనట్టే!
– గవర్నర్ వర్సెస్ సీఎంగా వార్
– ప్రభుత్వ నిర్ణయంపై తమిళిసై తీవ్ర అసహనం
కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈమధ్యే బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో యుద్ధం మొదలైందన్న సందేశాన్ని పంపారు. ఇప్పుడు మరోసారి మోడీని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో మోడీ పార్లమెంట్ కడుతుంటే.. తెలంగాణలో కేసీఆర్ సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది ఈ భవనం. ప్రారంభోత్సవానికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ఈ భవనం ప్రారంభోత్సవానికి కొందరు జాతీయ నేతలకు కూడా ఆహ్వానం పంపారు కేసీఆర్. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. సచివాలయం ప్రారంభం తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ సభపైనే అందరి దృష్టి నెలకొంది. ఎందుకంటే.. అంతకంటే ముందే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అదే పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారని అంటున్నారు. దీనికోసం బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అగ్ర నాయత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మోడీ సభ ఉండాలని రాష్ట్ర నాయకులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పరేడ్ గ్రౌండ్ లో సభ జరిగితే.. మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జాతీయ నేతల వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే.. మోడీ ప్రసంగం తర్వాత 4 రోజులకి కేసీఆర్ అదే ప్రాంతంలో సభ నిర్వహించనున్నారు. అంటే.. ప్రధాని వ్యాఖ్యలకు మాటకు మాట కౌంటర్ ఎటాక్ కొనసాగే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇరు సభలపై రాష్ట్రవ్యాప్తం చర్చ జరుగుతోంది.
మరోవైపు.. పరేడ్ గ్రౌండ్ చుట్టూ మరో వివాదం కూడా జరుగుతోంది. రిపబ్లిక్ డే వేడుకలు.. ప్రతీ ఏడాది పరేడ్ గ్రౌండ్ లోనే జరుగుతుంటాయి. రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. కానీ, కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకల్ని రాజ్ భవన్ కే పరిమితం చేశారు. పైగా కేసీఆర్ గానీ, ఇతర నేతలు గానీ ఎవరూ హాజరవ్వలేదు. అయితే.. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు ఉంటాయని అనుకుంటుండగా కేసీఆర్ సర్కార్ షాకిచ్చింది. ఈ ఏడాది కూడా రాజ్ భవన్ లోనే వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం లేఖ పంపంది. దీనిపై తమిళిసై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లేఖపై స్పందిస్తూ.. రాష్ట్రంలో వేడుకలు ఘనంగా జరగకపోవడం పట్ల ఆవేదన చెందారు. కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. దీంతో ఈసారి కూడా రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ గురువారం జాతీయ పతాకం ఆవిష్కరించి.. ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు.