తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్ కుర్మయ్య నామినేషన్లు మాత్రమే మిగలడంతో.. ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది.
ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఈ ముగ్గురు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.