ఏపీ సంక్రాంతి సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కూడా మునిగిపోయాయి. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తగిన సమయంగా భావించిన బీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
ఏపీలో పార్టీ బలోపేతానికి ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న బీఆర్ఎస్ అధిష్టానం..ఇందులో భాగంగా సంక్రాంతి పండుగను ఏపీ బీఆర్ఎస్ నాయకులు వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు. అలాగే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్థ సారథి, మరికొందరు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు ప్రారంభించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పలు జిల్లాలు, ప్రధాన నగరాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా,గుంటూరు జిల్లాల్లో జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, ముక్కామల, యానాం తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
కేసీఆర్,కేటీఆర్ ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీని ఏపీ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పైనా, కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఇప్పటికే సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తోంది. ఇలా హైదరాబాద్ లో నివసిస్తున్నసెటిలర్లతో పాటు ఆంధ్రా ప్రజలను కూడా ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.