దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్న బీఆర్ఎస్ ముందుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో చక్రం తిప్పి సత్తా చాటాలనుకుంటుంది. దీని కోసం మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇక తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును కోరుకోవడం బీఆర్ఎస్ కు పెద్ద ప్లస్ గా మారింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు మహారాష్ట్రలోని లోహా నియోజక వర్గంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో ఇది రెండో సభ అవుతుంది. అయితే ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు.. జనం భారీసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో.. పార్టీ శ్రేణులు ఆ దిశగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందుగానే జన సమీకరణ కోసం కేసీఆర్ కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించడం జరిగింది.
మరో వైపు మహారాష్ట్రలోని బీజేపీ,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు సైతం బీఆర్ఎస్ తో కలిసి ముందుకు రావడంతో కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే ఫిబ్రవరి 5 న నాందేడ్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మొదటి బహిరంగ సభకు మంచి స్పందన రావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ పేరును నమోదు చేయడం జరిగింది. ఇక ఇటీవల లోహా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ నేత శంకర్ గణేశ్ రావు ధోంగె.. తమ నియోజక వర్గంలో బహిరంగ సభను నిర్వహించాలని హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ ను కోరడం జరిగింది. దీంతో కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు 10 రోజు నుంచి అక్కడ బస చేసి ఈ సభకు ఏర్పాట్లు చేశారు.
ఇక కేసీఆర్ మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సభకు చేరుకోనున్నారు. మూడు గంటలకు స్థానిక నేతలతో సమావేశమై నాలుగు గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నారు. అయితే ఈ సభలో.. ముఖ్యంగా జాతీయ రాజకీయాల తాజా పరిణామాలపై కేసీఆర్ ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ఇప్పటికే తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. ఈ అంశంపై ఏం చెప్తారన్నది ఉత్కంఠగా మారింది.