– జనసేనకు బీఆర్ఎస్ ప్యాకేజీ!
– నిజం ఏంటో తేల్చేసిన కవిత
– నెక్ట్స్ ఎలక్షన్ పైనా ఇంట్రస్టింగ్ కామెంట్స్
– తమకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం
– కేటీఆర్ సీఎం అభ్యర్థి ప్రచారంపైనా క్లారిటీ
బీఆర్ఎస్.. ఏపీ రాజకీయాల్లో అప్పుడే హీట్ పుట్టిస్తోంది. సీఎం జగన్ కు మేలు చేసేందుకే ఏపీలో బీఆర్ఎస్ విస్తరించినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తున్నాయి. కాపుల ఓట్లను చీల్చి టీడీపీకి నష్టం చేసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో గత కొంత కాలంగా జోరుగా సాగుతుంది.
ఈ క్రమంలో ఈ విషయం పై ఎమ్మెల్సీ కవిత స్పందన మరింత హాట్ టాపిక్ గా మారింది.”కాపు ఓటు బేస్, ఇంకొకటి కాకుండా ఏపీ ప్రజల ప్రయోజనాలు ఎలా కాపాడాలి. ఆ ఎజెండా సాకారం అవ్వాలంటే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే వ్యూహం ఉంటుంది.
కులాల వారీగా లేదా మతాలు, వర్గాల వారీగా అనేది సీఎం కేసీఆర్ ఆయా రాష్ట్రాలను బట్టి వ్యూహాన్ని నిర్ణయిస్తారు. పొలిటికల్ పార్టీలకు మేలు చేయడానికి బీఆర్ఎస్ పెట్టలేదు. ప్రజలకు మేలు చేయడానికి పెట్టాము. ప్రజలకు ఏది ముఖ్యం, ప్రజల కోసం టేకప్ చేయాల్సిన ఇష్యూ ఏంటీ.. అనేది ప్రధానంగా ఉంటుంది. తప్ప ఏ పార్టీకి సహాయం చేయడానికి కాదు” అని కవిత తెలిపారు.
ఈ సందర్భంగా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోనివ్వకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ కు కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. ఆ విషయం గురించి తనకు తెలియదని, తాను వినలేదని చెప్పారు. ఏపీలోనే కాదని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరిస్తున్నట్లు చెప్పారు.
తమకు యూపీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో.. ఏపీ మీద కూడా అంతే ఉంటుందని,దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కేటీఆర్ సీఎం అంటూ వస్తున్న వార్తలపై కవిత ఓపెన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ నే మా సీఎం అభ్యర్థి అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకు ఉందన్నారు. మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తామన్నారు.
తెలంగాణలో పనిచేస్తూనే దేశవ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. ఏ పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా నేను పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీకి ఎంత చేతనైతే అంత పనిచేస్తానని అన్నారు. పార్టీ గుర్తించినప్పుడు పదవి ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది కూడా పార్టీనే డిసైడ్ చేస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.