అధికార పార్టీలో పెద్ద తలకాయతో కాస్త మంచి పరిచయాలుండి.. వాళ్ళతో దిగిన సెల్ఫీలు ఉంటే బాగా కలిసి వస్తుంది. షార్ట్ కట్ లో ఏదైనా చేసేందుకు రెడ్ కార్పెట్ పరిచినట్టే. ఇక వ్యవహారం భూమి అయితే.. ఇంకా ఎక్కువగా దోచేయొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో తరుచుగా జరుగుతున్న మోసాలు ఇలాగే ఉన్నాయి. తాజాగా నోటరీ స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేయిస్తానంటూ బీఆర్ఎస్ నాయకుడు సిర్నరాజు అమాయకులను నిండా ముంచేసి కోట్లు మూటకట్టుకున్నాడు.
బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ ప్లే చేసే కేటీఆర్, మల్లారెడ్డి, పల్లాల పేర్లు చెప్పి అక్రమ దందాకు తెరలేపాడు సిర్నరాజు. జవహర్ నగర్ తో సహా శివారు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో జనం దగ్గర్నుంచి వసూళ్లు చేశాడని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక నోటరీ ల్యాండ్లను రిజిస్టర్ స్థలాలుగా మార్చుతానని నమ్మించడంతో చాలామంది సిర్న రాజు చేతిలో నిండా మోసపోయారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు.
సీన్ కట్ చేస్తే.. షరా మామూలే. అధికార పార్టీలో ఉన్న నేత. అందులోనూ కోట్లలో వ్యవహారం కాబట్టి ఖాకీలు కూడా చేతులు కలిపారు. సిర్నరాజుపై చీటింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట ఎస్సై నాగుల్ మీరా అక్రమార్కుడితో కుమ్మక్కైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. పీఎస్ లో సెటిల్మెంట్ కు ఎస్సై బెదిరింపులకు దిగినట్టు వారు చెబుతున్నారు.
అంతేకాదు.. తాను చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వాలంటూ బాధితులను ఎస్సై బెదిరించినట్టుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే గతంలోనే అనేక అవినీతి ఆరోపణలున్న సిర్నరాజుపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి.. ఎఫ్ఆర్ఐ ను కూడా క్లోజ్ చేసేయడం. దీంతో బాధితులు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.