కాంగ్రెస్ పై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడితే తాము చూస్తు ఊరుకోబోమని, వారి నాలుకలు చీరుస్తామని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
భద్రాచలంలో ఆయన ఈ రోజు పర్యటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైందన్నారు. పార్టీలో పోటీలు తట్టుకోలేక కొందరు నాయకులు బయటకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు.
కార్యకర్తలకు కొందరు నేతలు డబ్బు ఆశ చూపి వలలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్క నాయకునికి తమ పార్టీలో అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు.
పార్టీలో ఉంటూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు పార్టీని బదనాం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తే పార్టీలో కేసీఆర్ పిలిచి అవకాశాలు ఇస్తారని అనుకోవద్దన్నారు. అది హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడమే అవుతుందన్నారు.