లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపింది. గురువారం విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నోటీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కవితకు ఈడీ నోటీసులు మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని విమర్శించారు. మోడీ దురాగతాలను బయటపెడుతున్న కేసీఆర్ పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని అన్నారు. అణచివేత దోరణితో దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మోడీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయన్న మంత్రి.. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదని స్పష్టం చేశారు.
ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికే నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త. మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతుంటే ఇలా చేయడం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల క్రితమే కవిత ప్రకటించారని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయని ఆరోపించారు. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదన్న ఆయన.. తేదీ, సందర్భంపై అభ్యంతరం తెలిపారు.
మిగిలిన నేతలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇది జరుగుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికే ఇదంతా జరుగుతోందని అంటున్నారు.