౼ ఒక్కో లబ్ధిదారుడు నుంచి రెండులక్షల వసూళ్లు
౼ కమీషన్ ఇవ్వని లబ్ధిదారులకు తప్పని వేధింపులు
౼ లబ్ధిదారుడి ట్రాక్టర్ ట్రక్కు లాక్కెళ్లిన బీఆర్ఎస్ నేత
౼ కమీషన్ ఇచ్చి తీసుకెళ్లాలంటూ హుకుం
౼ చోద్యం చూస్తున్న అధికారులు
స్వయం ఉపాధితో నిరుపేద దళితులను స్వప్రయోజకులను చేయాలనే బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఆదాయమార్గంగా మలుచుకుంటున్నారు. దళితబంధు పొందిన లబ్ధిదారులను కమీషన్ల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని తెలగరామవరంకు చెందిన నిరుపేద దళిత కుటుంబం కండె సరోజ – రాములు దంపతులకు దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ట్రాక్టర్ మంజూరు చేసింది.
దీంతో ఇన్నాళ్లూ కూలిపనులతో బ్రతుకీడిస్తున్న తమ బ్రతుకుల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందని ఆశపడ్డారు. అయితే అంతలోనే వారి ఆశలన్నీ నిరాశలయ్యాయి. తామే దళితబంధుకు ఎంపిక చేశామని.. అందుకు రెండు లక్షలు కమీషన్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు సరోజ, రాములను డిమాండ్ చేశారు. అయితే ఆ దంపతులు తాము ఇచ్చుకోలేమన్నారు. దీంతో సదరు లబ్ధిదారుడికి ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్ ట్రక్కును లాక్కెళ్లారు బీఆర్ఎస్ శ్రేణులు.
తనకు దళితబంధు పథకం కింద ట్రాక్టర్ మంజూరైన కూలీపనులకే వెళుతున్నానని సదరు బాధిత కుటుంబం.. లక్షీదేవిపల్లి స్వతంత్ర జడ్పీటీసీ మేరెడ్డి వసంతను ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరు ట్రక్కును తిరిగి లబ్ధిదారుడికి అందేలా చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలు దళిత బంధు లబ్ధిదారులను కమీషన్ల కోసం జలగల్లా పట్టిపీడిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ప్రమేయం లేకుండా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కమీషన్ కోసం దళిత బంధు లబ్ధిదారుడిని వేధించిన బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి మండలాధ్యక్షుడు కొట్టివెంకటేశ్వర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.