తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రతిపక్ష కాంగ్రెస్ కు మధ్య వైరం చూస్తూనే ఉన్నాం. ఈసారి కేసీఆర్ ఓటమి ఖాయమని.. కాంగ్రెస్ గెలుపు పక్కా అని హస్తం నేతలు చెబుతూ వస్తున్నారు. దీనికోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అన్నింటినీ వాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. అలా.. మార్కండేయ లిఫ్ట్ పనుల విషయంలో దృష్టి సారించారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని బిజినపల్లి మండలం షాయిన్ పల్లి దగ్గర మార్కండేయ లిఫ్టు పనులు జరుగుతున్నాయి. అయితే.. నాలుగేళ్లు దాటినా ఇది ప్రారంభానికి నోచుకోలేదు. ఈక్రమంలో పనులను పరిశీలించేందుకు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వెళ్లారు. ఆయనతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.
అయితే.. కాంగ్రెస్ శ్రేణులను బీఆర్ఎస్ వర్గాలు అడ్డుకున్నాయి. రాత్లావత్ వాల్యా అనే కాంగ్రెస్ కార్యకర్తను దారుణంగా కొట్టటమే కాకుండా గొంతు మీద కాలు పెట్టి తొక్కారు గులాబీ నేతలు. దీనిపై హస్తం నేతలు మండిపడుతున్నారు. ఇలాంటి దాడులకు తాము భయపడమని.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
మార్కండేయ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని నాగం జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం శిలాఫలకం వేసి 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ కు రూ.76.96 కోట్ల నిధులు మంజూరు చేసినా తట్ట మట్టిని కూడా తీయించలేదని విమర్శించారు. పనులు ప్రారంభించకపోతే శిలాఫలకం దగ్గర దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. దౌర్జన్యాలకు దిగుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలన్నారు నాగం.