– తమిళిసై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎటాక్
– రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న తలసాని
– గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
– తమిళిసై కేంద్రం గురించే మాట్లాడారని కవిత సెటైర్
– కొంతమంది కోసం పని చేయొద్దన్న పోచారం
– అభివృద్ధిని గుర్తించకపోవడం బాధాకరమన్న గుత్తా
రిపబ్లిక్ డే వేడుకల ఇష్యూ హైకోర్టు వరకు వెళ్లింది. సెలెబ్రేషన్స్ ఘనంగా ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం రాజ్ భవన్ కే పరిమితం చేసింది. అయితే.. వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఇండైరెక్ట్ గా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు వరుసబెట్టి గవర్నర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. సీఎస్ ను పక్కన పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. గవర్నర్ ను వదిలిపెట్టమని.. రాష్ట్రపతి అన్నీ వివరిస్తామని అంటున్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగ హోదాలో ఉండి రిపబ్లిక్ డే రోజు అలా మాట్లాడకూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. గవర్నర్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రెసిడెంట్ జోక్యం చేసుకొని గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సీఎస్, డీజీపీని పక్కన పెట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేశారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. కొత్త భవనాలు నిర్మించడం, ఫాంహౌజ్ లు కట్టుకోవడమే అభివృద్ధి కాదన్న గవర్నర్ వ్యాఖ్యలకు ఇండైరెక్ట్ గా మాట్లాడారు. ఎవరి బాధ్యత ఏంటో చెప్పినదే రాజ్యాంగం అని.. స్పీకర్ అయినా, ప్రధాని అయినా రాజ్యాంగం పరిధిలోనే పదవులు వచ్చాయని గుర్తు చేశారు. కొంతమంది కళ్లలో సంతోషం కోసం పరిపాలన చేయొద్దన్న పోచారం.. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. దేశ సంపద కొంత మంది చేతుల్లోనే ఉందన్నారు. పేదలకు పెద్ద పీట వేయాలన్న ఆయన.. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతోందని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ‘‘కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సెంట్రల్ విస్టా మీద కంటే, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కానీ, కేంద్రం మాత్రం కొందరి ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెట్టింది. అలా కాకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో గవర్నర్ తన ప్రసంగంలో అవే అడిగినందుకు ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందన్నారు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అభివృద్ధిని గుర్తించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ క్షేత్రాలు, కొత్త భవనాలపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారు.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు.