– ఉత్తమ్ ఇంట్లో బీఆర్ఎస్ నేతలు
– పార్టీ మారుతున్నారా?
– లేక.. ఇప్పటికే కలిసే ఉన్నారా?
– సోషల్ మీడియాలో రకరకాల చర్చలు
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆ రెండు పార్టీలు దొందూదొందే అంటూ తరచూ ఫైరవుతుంటారు. అయితే.. బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటని అంటుంటారు. తాజాగా కవిత ఈడీ విచారణ విషయంలో కాంగ్రెస్ కీలక నేతలు మౌనం దాల్చడంపై కమలనాథులు కార్నర్ చేస్తున్నారు. ఎవరు ఎవరితో కలిసి ఉన్నారో తెలియని కన్ఫ్యూజన్ అయితే.. అన్ని పార్టీలు క్రియేట్ చేస్తున్నాయనే వాదన ఉంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
కవిత ఈడీ విచారణ సందర్భంగా.. ఆమెకు మద్దతుగా చాలామంది నేతలు ఢిల్లీ వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ వంటి వారంతా తెలంగాణ భవన్ లో బస చేశారు. కానీ, బీఆర్ఎస్ మహిళా నేతలకు మాత్రం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఆతిథ్యం ఇచ్చారు. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు లీడర్లు.. పద్మావతి ఇంట్లోనే బస చేశారు. కవిత విచారణ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు వారు అక్కడే ఉన్నారు.
బీఆర్ఎస్ మహిళా నేతలు, పద్మావతి కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ రెండు పార్టీలు ఒకటే అని విమర్శలు చేస్తున్నారు కమలనాథులు. ఈ ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఆత్మ రక్షణలో పడిందని అంటున్నారు. ఓవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేస్తుంటే.. ఈ తాజా పరిణామం నష్టాన్ని తెచ్చి పెడుతుందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఉత్తమ్ పార్టీ మార్పుపైనా ప్రచారం సాగుతోంది. తన భార్య ద్వారా బీఆర్ఎస్ లో చేరికపై సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా? అనే వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే.. ఉత్తమ్ వర్గీయులు ప్రత్యర్థులకు సైతం ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ నైజం అని అంటున్నారు. మొత్తానికి ఈ ఫోటో.. బీజేపీకి ఓ ఛాన్స్ ఇచ్చినట్టుగా మారిందని అంతా అనుకుంటున్నారు.