– వరుసగా మంత్రుల ఇండైరెక్ట్ వార్నింగ్స్
– బీజేపీలో చేరికలపై హరీష్ హాట్ కామెంట్స్
– తమ గోతిని తామే తవ్వుకున్నట్టేనని సెటైర్స్
– పొంగులేటిని ఉద్దేశించే అన్నారని జిల్లాలో చర్చ
– హరీష్ వ్యాఖ్యలపై చర్చ సాగుతుండగానే రంగంలోకి పువ్వాడ
– ఖమ్మంలో పనికిమాలిన బ్యాచ్ ఉందని వ్యాఖ్య
ఖమ్మం బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఓవైపు పార్టీ ఆవిర్భావ సభ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అధిష్టానం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి సమయంలో సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్యలు అనుమానాస్పదంగా మారాయి. అయితే.. పొంగులేటిని బీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సభ కోసం మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. జన సమీకరణ కోసం పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఓవైపు సభ ఏర్పాట్లు చూస్తూనే ఇంకోవైపు పొంగులేటికి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు హరీష్. బీజేపీలో చేరాలనుకునే వారు తమ గోతిని తామే తవ్వుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. హరీష్ వ్యాఖ్యలపై చర్చ సాగుతుండగానే.. పొంగులేటి తన ఫేస్ బుక్ ఖాతాలోని ప్రొఫైల్ లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను తీసేశారు. తాను సోలోగా ఉన్న ఫొటోను అప్ డేట్ చేశారు. దీంతో ఖమ్మం బీఆర్ఎస్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. తనను ఒంటరిగా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని భావిస్తున్న పొంగులేటి ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఖమ్మం నియోజకవర్గం సన్నాహాక సభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఖమ్మంలో పనికిమాలిన బ్యాచ్ ఉందన్నారు. వాళ్లకు అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం సాగుతుండగా పువ్వాడ చేసిన కామెంట్స్ ఇంట్రస్టింగ్ గా మారాయి. పైగా తమ పార్టీ ఐక్యంగా ఉంటే బీజేపీ చూడలేకపోతోందని అన్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అవకాశాన్ని 33 జిల్లాల్లో మన జిల్లాకి కేసీఆర్ ఇచ్చారని.. ఖమ్మం మీద గాని ఇక్కడి ప్రజల మీద గాని కేసీఆర్ కి ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచించాలన్నారు పువ్వాడ. ఇలాంటి బంగారు అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని కోరారు. మొత్తానికి బీజేపీ టార్గెట్ గా పొంగులేటిని టచ్ చేస్తూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.