బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. గ్యాస్ ధరల పెంపుపై కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని ధర్నాలకు దిగారు. హుజూర్ నగర్ అడ్డరోడ్డు దగ్గర ఖాళీ గ్యాస్ సిలిండర్లకు నల్లజెండాలు కట్టి.. కట్టెల పొయ్యితో వంట చేసి బారీ ఎత్తున నిరసనలు తెలియజేసారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, పార్టీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ సహా కార్యకర్తలు పాల్గొన్నారు.
కేటీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు మంత్రి శ్రీనివాస్. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి వంటావార్పు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తలసాని.
పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లపై పూలు చల్లి వెనక్కి పంపుతూ ధరల భారం తాము మోయలేమంటూ డౌన్ డౌన్ మోడీ అని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొన్నారు.
ఇటు సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఎమ్మెల్సీ రాజు పాల్గొన్నారు. ‘సామాన్యుడికి గుదిబండి.. గ్యాస్ బండ’’ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
మోడీ చెప్పినట్టు ఆదాయం రెండింతలు పెరగలేదు కానీ.. సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగిందని సెటైర్లు వేశారు క్రిశాంక్. కేటీఆర్ పిలుపుతో గ్యాస్ ధరల పెంపుపై కంటోన్మెంట్ వద్ద నిరసన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన గులాబీలు.. రోడ్డుపైనే కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు.