24 గంటల విద్యుత్ అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తుంది. విద్యుత్ పై అసెంబ్లీ లో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ మాట్లాడుతూ..24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు సభలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.
కనీసం 8,9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సభ్యులు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని.. అప్పుడైనా ధర్నాలు కనపడతాయని ఎద్దేవా చేశారు. కరెంటు కోతల నిజం తెలుసుకునేందుకు గ్రామాలకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
సభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. కనీసం రోజుకు 13 గంటల కరెంటు ఇచ్చి..రైతులను ఆదుకోవాలన్నారు. కరెంటు కోతలపై శాసనమండలిలో చర్చ జరగాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.