గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలు రెండో రోజూ కొనసాగాయి. పలుచోట్ల వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ను ఉరి తీసి, పాడె కట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధరలను అదుపుచేయడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోఠిలో గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న ఓ ఆటోను మహిళలు అడ్డుకోగా వారికి ఆటో డ్రైవర్ కూడా మద్దతిచ్చాడు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు పెను భారంగా మారిన గ్యాస్ సిలిండర్ల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.