దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోరు జారారు. చాకలి, మంగలి పనులు నేనే చేయాలా అంటూ వేదికపైనే మహిళా ఎంపీపీ సరళారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ కావడంతో రెండు కులాల మనోభావాలు దెబ్బతీశారని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పై కులసంఘాలు మండిపడ్డాయి. కుల సంఘాలు ఆందోళన చేపట్టడంతో భాస్కర్ రావు దిగొచ్చారు.
దీంతో తాజాగా రెండు కులాల వారికి క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేశారు. మహిళ ఎంపీపీ సరళను పేరు పెట్టి వేదికపై ఆహ్వానించకపోవడంతో ఆమె ఫీల్ అయ్యారని.. ఆ సందర్భంలో చాకలి, మంగలి అనే పదాలు వాడినట్లు ఎమ్మెల్యే భాస్కర్ రావు వివరణ ఇచ్చారు.
కాగా పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యేకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం వార్నింగ్ వల్లే రెండు వర్గాల వారికి భాస్కర్ రావు బహిరంగ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.