తెలంగాణకు తలమానికంగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన సచివాలయం నిర్మించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. దానిని కూలగొడతామన్న బండి సంజయ్ నోరు.. అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అంటే.. ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రగతి భవన్ పగులగొడతా అని ఇంకో పిచ్చోడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసం, టీవీల్లో కవరేజ్ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతాంగం కోసం.. తెలంగాణ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారని అన్నారు ఆరూరి రమేష్.
ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో నూతన సెక్రటేరియట్ కి అంబేద్కర్ పేరు పెట్టుకుంటే బండి సంజయ్ కళ్లు మండుతున్నాయని దుయ్యబట్టారు. బండి సంజయ్ దళిత వ్యతిరేకి అంటూ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని లేదంటూ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరి ఆస్తి అన్నారు. దీన్ని కూలగొడతా అంటే ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడ్రెస్ లేదు. ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఇద్దరూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇద్దరినీ ఎర్రగడ్డలో జాయిన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్.