వరంగల్ లో కొత్త సచివాలయం బుధవారం ప్రారంభమైంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభించారు. అదేంటి కొత్త సెక్రటేరియట్ హైదరాబాద్ లో కదా.. వరంగల్ లో ఎలా ప్రారంభిస్తారు? అని అనుమానం వచ్చిందా? మీరు చదివింది నిజమే. వరంగల్ లోనూ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కానీ ఇది నిజమైన సెక్రటేరియట్ కాదు. సచివాలయ నమూనాతో ఏర్పాటు చేసిన సెట్టింగ్.
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా స్థానిక అజంజాహి గ్రౌండ్ లో రూ.30 లక్షల ఖర్చుతో కొత్త సెక్రటేరియట్ నమునాతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఈ సెట్టింగ్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే ఈనెల 18న శివరాత్రి ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలు ఇక్కడే పూజలు చేసేలా మరో రూ.30 లక్షలతో భారీ శివలింగం, భక్తులు జాగారం చేసేందుకు గాను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
అనంతరం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నూతన సచివాలయ సెట్టింగ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సచివాలయ సెట్టింగ్ లో రాష్ట్రంలో అమలవుతున్న పథకాల ఫోటోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ సాధనలో కేసీఆర్ ఎదుర్కొన్న ఒడిదొడుకులు, రాష్ట్రాన్ని సాధించిన తీరును వివరిస్తూ ఫోటోలను ప్రదర్శనకు పెట్టామన్నారు. మొత్తం 48 గంటల పాటు కష్టపడి సెక్రటేరియట్ సెట్టింగ్ ను నిర్మించినట్లు ఎమ్మెల్యే నన్నపునేని తెలిపారు.