జగిత్యాల ఛైర్ పర్సన్ భోగ శ్రావణి వాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణి చేసిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. గత కొన్ని నెలలుగా ఛైర్ పర్సన్ పై కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. అయినా వారికి సర్ధి చెప్పాం. ఇటీవల కొందరు కౌన్సిలర్లు ఆవిశ్వాసం అంశం తీసుకువచ్చినా తోసిపుచ్చానని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లానని గుర్తు చేశారు.
బుధవారం ఉదయం కౌన్సిలర్ల సమన్వయ సమావేశానికి రావాలని శ్రావణికి స్వయంగా ఫోన్ చేసి చెప్పినా.. ఆమె హజరు కాలేదన్నారు ఎమ్మెల్యే. తాము తండ్రీకూతుళ్లలా ఉండేవాళ్లమని, మంచి ఫ్యూచర్ ఉందని శ్రావణికి ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కాగా జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి భోగ శ్రావణి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టారు. మూడు సంవత్సరాల పదవీకాలంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎస్పీని కోరారు.తన కుటుంబాన్ని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె ఆరోపించారు. తాను పేరుకే మున్సిపల్ ఛైర్ పర్సన్ అని, పెత్తనం అంతా ఎమ్మెల్యేలదేనని, పలు సందర్భాల్లో నలుగురు తిట్టినా కూడా భరించానని చెప్పారు.
పార్టీ కోసమే ఇన్నాళ్లు కట్టుబడి పని చేశానని, కానీ తమ కుటుంబంపై బెదిరింపులకు దిగడంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానన్నారు. తనకు పదవి దక్కేందుకు కారకులైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, మంత్రి కేటీఆర్ కు శ్రావణి కృతజ్ఞతలు తెలియజేశారు.