లిక్కర్ దందా చేసే స్నేహితులు ఉండరా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను ఎమ్మెల్యేనని.. లిక్కర్ దందా చేసే స్నేహితులు ఉండరా? అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను ఓ ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తున్నా.. తనను విమర్శిస్తూనే ఉంటున్నారని మండిపడ్డారు. తాను కాంట్రాక్టర్ దగ్గర 30 శాతం కమిషన్ తీసుకుంటానని కాంగ్రెస్ నాయకులు ఛార్జ్ షీట్ వేశారని సంజయ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ తరహా రాజకీయం జగిత్యాలలో తానెప్పుడూ చూడలేదని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను ఇటీవలే ఈడీ అధికారులు విచారించారు. తన ఫోన్లను ధ్వంసం చేశారన్న వార్తలపైనా స్పందించిన కవిత.. ఇటీవలే తన ఫోన్లను చూపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.