కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ.. ఈ ప్రాంత బిడ్డగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆ బాధ్యతలు మరచి అడ్డగోలు చిల్లర విమర్శలకు పరిమితమయ్యారని అందులో పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి ఏనాడూ తెలంగాణ ప్రజలకోసం పనిచేయలేదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం లో తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయినట్టుగానే నేడు కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేక ఒక అసమర్థుడిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తుంటే పట్టించుకోకుండా సిగ్గులేకుండా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వరదల సమయంలో 1000 కోట్ల సహాయాన్ని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ లో భారీ వర్షాలతో వరదలొస్తే.. బండి పోతే బండి ఇస్తాం అంటూ ఢంబాచారాలు పలికి.. అర్థ రూపాయి సాయం కూడా చేయలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వమే వారిని ఆదుకుందన్నారు. వరంగల్ జిల్లాలో గత ఏడాది జనవరిలో వడగండ్ల వాన సృష్టించిన విధ్వంసానికి రైతులు తీవ్రంగా నష్టపోతే తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడి అందించి ఆదుకుందన్నారు.
తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి మాత్రం అర్థ రూపాయిసాయం చేయకపోగా కనీసం ఇటు వైపు చూడనే లేదని విమర్శించారు. తెలంగాణకు ప్రతీ విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారని..కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మరియు ఎన్నికలున్న రాష్ట్రాలకు మాత్రం ఆదుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని వరదసాయం అడిగితే మొండి చెయ్యి చూపించింది మోడీ సర్కార్ అని కిషన్ రెడ్డికి పంపిన లేఖలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.