– 10 గంటలపాటు కవిత విచారణ
– పాత ఫోన్ల చుట్టూనే కొనసాగిన ప్రశ్నలు
– మొత్తం 3 విడతల్లో 28 గంటల విచారణ
– 6 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీస్ కి సోమా భరత్
– క్షణక్షణం ఉత్కంఠ రేపిన విచారణ
– ఈడీ ఆఫీస్ పరిసరాల్లో టెన్షన్ టెన్షన్
ఎమ్మెల్సీ కవితను మూడోరోజు కూడా ఈడీ సుదీర్ఘంగా విచారించింది. సుమారు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. మొత్తం మూడు విడతల్లో 28 గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు కవిత. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి 9.40 గంటల వరకు కొనసాగింది. చివరిలో డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో రాత్రి 9.45 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు కవిత. అంతకుముందు కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలను ఆయనతో తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, కవితకు సంబంధించిన ఆథరైజేషన్ సంతకాల కోసం పిలిపించినట్లు సమాచారం. ఇక తదుపరి విచారణకు కవిత స్థానంలో ఆయన హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
తదుపరి విచారణ తేదీపై తర్వాత సమాచారం అందిస్తామని ఈడీ అధికారులు చెప్పినట్టు సమాచారం. కవిత విచారణ నేపథ్యలో ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత తన ఫోన్లను మీడియాకు చూపించారు. ఫోన్లను ధ్వంసం చేశారన్న ఈడీ ఆరోపణలను ఖండిస్తూ ఆమె తన ఫోన్లను మీడియాకు చూపించారు.
తనపై ఈడీ కావాలనే దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. లిక్కర్ కేసులో ఫోన్స్ వ్యవహారం ప్రధాన టాపిక్ గా మారింది. వాటిని ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో తెలిపాయి. అయితే.. అవి పగలగొట్టలేదని తనకే ఫోన్స్ మార్చడం ఇష్టమనే విధంగా అన్నింటినీ ఈడీకి ఇచ్చారు కవిత. దీంతో సరిగ్గా సమాచారం రాబట్టకుండానే చార్జిషీట్లలో పగుల గొట్టారని చెప్పడం విచారణ సరిగ్గా జరగడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. 36 మంది సాక్షులు 170 సెల్ ఫోన్స్ మార్చారని ఇందులో కొన్నింటిని ధ్వంసం చేశారని తెలిపారు
అధికారులు. కవిత 2 నెంబర్స్ తో 10 ఫోన్స్ మార్చారని తెలిపారు. మొదటి విచారణలోనే అప్పటి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. మంగళవారం 9 ఫోన్స్ మీడియాకు చూపించి లోపలికి వెళ్లారు. ఒకే రోజున గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్ వారి సెల్ ఫోన్స్ ఐ ఫోన్ 14 ప్రో ఫోన్స్ తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ 1న ఇది జరిగింది.
అదే విధంగా పిళ్లై నాలుగు రోజుల ముందు మార్చుకున్నారు. ఇలా మార్చడం నేరమేమీ కాకపోయినా.. అందులో డేటాను ధ్వంసం చేసినట్లు ఈడీ చెబుతోంది. కేసు విచారణ చేపడుతున్న సమయంలో ఫోన్స్ మార్పు చేయడంతో దీనిపై ఎక్కువ ఫోకస్ చేసింది ఈడీ. అయితే.. వాట్సాప్, ఫేస్ టైం, కాల్ డేటా ను ఇట్లే తీసుకునే ఈడీ.. ఆ ప్రకారంగా విచారణ చేయవచ్చు.
కానీ, కేసుకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. సమాచారం అంతా కావాలని కోరుతోంది. దీంతో కవిత కూడా కేసు విచారణకు ఏం కావాలో అది ఇస్తానని మరెలాంటి సంబంధం లేని సమాచారం ఇచ్చేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నందున ఎంతో మందితో ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఉంటాయని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈడీ మాత్రం ఈ కేసుతో అన్ని అర్థిక లావాదేవీలను వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.