– పేరెంట్స్ తో రోజంతా ప్రగతి భవన్ లోనే!
– ధైర్యం చెప్పి పంపిన కేసీఆర్
– కవిత వెంట అన్న కేటీఆర్
– నేడు ఈడీ ముందు హాజరు!
– అరెస్ట్ తప్పదంటున్న హస్తిన వర్గాలు
తొలివెలుగు క్రైం బ్యూరో.
ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు. 16న విచారణకు హాజరు కాకుండా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, స్టే కు కోర్టు నిరాకరించడంతో ఈడీ మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. ఆఫీస్ లో కాకుండా ఇంటికి వచ్చి విచారించాలని ఆమె కోరుతున్నారు. అయినప్పటికీ రేపు తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
దీంతో కవిత బేగంపేట నుంచి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో భర్త అనిల్, సోదరులు కేటీఆర్, సంతోష్ రావులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు కవిత. గతంలో లాగా తుగ్లక్ రోడ్డులో కార్యకర్తలతో హంగామా వద్దని కేసీఆర్ ఖరాకండీగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే, ఇప్పటికే ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నవారు రద్దు చేసుకున్నట్టు సమాచారం.
అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్లాన్స్?
సుప్రీంకోర్టులో తమకు తెలియకుండా కవిత మరో పిటిషన్ దాఖలు చేసి తీర్పులు తీసుకోకుండా ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో తప్పకుండా విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో 20న విచారణకు హాజరవుతున్నారు. ఎలాంటి పరిస్థితిల్లోనైనా ధైర్యంగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
న్యాయపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని కొంతమందికి అప్పగించినట్లు సమాచారం. విచారణకు హాజరు కాకుంటే ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశం కూడా రావడంతో ఈడీ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కవితను అరెస్ట్ చేసేందుకు ఈడీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గత విచారణకు రాకపోవడంతో ఈసారి అరుణ్ రామచంద్ర పిళ్లై, మాజీ అడిటర్ గోరంట్లతో పాటు సిసోడియాను కలిపి విచారించనున్నారు.
ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిని 15 నుంచి 20 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నగదు బదిలీలు, బినామీల వ్యవహారంపై ఈడీకి ఇప్పటికే ఓ స్పష్టత రావడంతో అరెస్ట్ చేసి విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.