ఆదానీ కంపెనీల వ్యవహరం పార్లమెంట్‌లో ప్రకంపనలు సృష్టించింది. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టి కూర్చుకున్నాయి. ఈ అంశంపై చర్చకు బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. గందరగోళం నేపథ్యంలో ఉభయసభలు వాయిదా పడ్డాయి.
ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావింత చేసే అంశమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కే.కేశవరావు అన్నారు. అందుకే ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చామని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ షేర్లు 27 శాతం పతనం కావడం దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు.
ఇలాంటి కీలకమైన విషయంలో సభ ఆర్డర్ లో లేదని చెబుతూ వాయిదా వేయడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. అది ఆర్థిక పరమైన అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరపాలని కోరామని వెల్లడించారు. గతంలోనూ హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ స్కాంలు జరిగాయన్నారు. వాటిపై అప్పుడు జరిగినట్లే ఇప్పుడు ఆదానీ కంపెనీలపైనా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం లాభాలు ప్రైవేటుకు పంచి పెడుతూ నష్టాలను మాత్రం ప్రభుత్వరంగంపై వేస్తోందని ఆరోపించారు. ఇక అదానీ షేర్లు, హిండన్‌బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. హిండన్‌బర్గ్ నివేదికపై సీజేఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.