అదానీ గ్రూపు వ్యవహారంపై విపక్షాలు పట్టు వీడటం లేదు. అదానీ గ్రూపు- హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని విపక్షాలు మరోసారి డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు.
పార్లమెంట్‌లో బడ్జెట్ రెండో దఫా సమావేశాలు జరుగుతున్నాయి. ఐదు రోజులుగా సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లో సభా కార్యకలాపాలను విపక్షాల సభ్యులు స్తంభింప చేస్తున్నారు.
పార్లమెంట్ ఆవరణలోనూ ఈ రోజు రాజ్యసభ ఎంపీలు అదానీ వ్యవహారంపై గళమెత్తారు. జేపీసీ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ నిరసనల్లో రాజ్యసభ సభాపక్ష నేత కే కేశవరావుతో పాటు సంతోష్, వెంకటేశ్ నేత, సురేశ్ రెడ్డి ఇతర ఎంపీలు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన ప్రదర్శనలో ఎంపీ సంతోష్ కుమార్ డప్పు వాయించి నిరసన తెలిపారు. మరోవైపు అదానీ అంశంపై కాంగ్రెస్ నేతలు సైతం నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ , కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.