పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో మొదటి రోజే విపక్షాలు నిరసన బాట పట్టాయి. ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ బీఆరఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో విపక్షాల నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ విషయంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేశాయి.
గందర గోళ పరిస్థితుల నేపథ్యంలో సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. అనంతరం పార్లమెంట్ విగ్రహం ముందు విపక్షాలు ధర్నాకు దిగాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సభ పున: ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది.
రాజ్యసభలో కూడా విపక్ష సభ్యుల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అదానీ సంక్షోభంపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.