బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి కేసీఆర్ కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించారు. అందులో ఏపీ కూడా ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అయితే ఇప్పటికే పలువురు ఏపీ నేతలు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
అందులో తోట చంద్రశేఖర్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు కూడా. ఇక పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబు, పార్థ సారథి, పలు నేతలకు కూడా కేసీఆర్ పలు బాధ్యతలు అప్పజెప్పారు. కాగా.. ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా అక్కడ తమకు అనుకూల మీడియా ఉండాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ కు అనుకూలంగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఉన్నాయనేది అందరికి తెలిసిందే. ఇక నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఉద్యమం సమయంలో కూడా కీలక భూమిక పోషించాయి. ఇందులో భాగంగానే వీటికి అనుబంధంగా తెలంగాణ టుడే అనే ఇంగ్లీష్ దినపత్రిక కూడా ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే తరహాలోనే ఏపీలో కూడా ఒక న్యూస్ పేపర్ ను తీసుకురావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నమస్తే తెలంగాణ యాజమాన్యంతోనే ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ పేరుతో పత్రికను తీసుకురానున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన ప్రణాళికలతో..పార్టీ నాయకుల కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా ప్రజల్లో ఆదరణ సంపాదించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.