జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సీఎం కేసీఆర్ చకా చకా పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలోనూ పార్టీకి ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అనుకుంటున్నారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కోసం పట్టణాభివృద్ధి సంస్థ 1200 చ.మీల స్థలాన్ని ఇచ్చింది. అయితే అక్కడ నిర్మాణాలు పూర్తి కావడానికి కొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలో అనుకున్న సమయానికి అవి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు.
ఈ క్రమంలో ఢిల్లీలోని డిప్లొమాట్ ఎవెన్యూలో కౌటిల్య మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్ లకు దగ్గరలో ఓ పెద్ద భవనాన్ని టీఆర్ఎస్ అద్దెకు తీసుకుంది. ఈ బంగళా చాలా కాలంగా వినియోగంలో లేదు. అందువల్ల ఈ భవనానికి పెయింటింగ్ లు వేస్తున్నారు. వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెల్లినప్పుడు అక్కడి రాజకీయ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాల కోసం ఈ భవనాన్ని పార్టీ వినియోగించుకోనున్నది. ఇది ఇలా ఉంటే ఈ నెల చివర వరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ సమయానికి ఈ తాత్కాలిక భవనంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.