కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేసే పనిలో పడ్డారు కేసీఆర్. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయడానికి ఈనెల 29 ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి.
రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1 న 2023 కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.
ఇక రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ తుది రూపు సంతరించుకుంటోంది. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు నిర్వహించే సంప్రదాయ హల్వా వేడుక ఢిల్లీలో గురువారం ఘనంగా జరిగింది. నార్త్ బ్లాక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ కిషన్ రావ్ కారాడ్, ఆశాఖ సీనియర్ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బడ్జెట్ రూపకల్పనలో సహకరించిన అధికారులు, సిబ్బందికి మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా అందించారు.
అయితే కార్మిక సంఘాలు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ముందుకెళ్తున్న మోడీ ప్రభుత్వం.. ఎన్నికల బడ్జెట్ లో ఆ దూకుడు కొనసాగించకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సేకరించే లక్ష్యాన్ని ఈ సారి 40,000 కోట్లకే పరిమితం చేసే అవకాశముందని చెబుతున్నారు. గత బడ్జెట్ లో నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆమడ దూరంలో నిలవడం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పెరుగుదల, ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం ఇందుకు కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.