ఖమ్మం దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ సమత సూసైడ్ కి యత్నించారు. ఖమ్మం రూరల్ మండలం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బెల్లం వేణు తనను ఇష్టం వచ్చినట్లు దూషించాడని మనస్తాపానికి గురైన ఆమె.. మంగళవారం కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే సహచర ఉద్యోగులు సమతను ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మారెమ్మ గుడి కమిటీ విషయం గురించి దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ సమతకు బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు ఫోన్ చేశాడు. మారెమ్మ గుడి కమిటీ గురించి దేవాదాయ శాఖ నోటిస్ బోర్డు, మండల ఆఫీసు,పేపర్ లోప్రకటన ఇచ్చామని సమత చెప్పారు. ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ వచ్చి కూడా 2, 3 నెలల సమయం అయ్యిందని చెప్పారు.
అయితే తమకు ఎందుకు చెప్పలేదని, సీక్రెట్ గా నోటీసు వేస్తే ఎలా అని బెల్లం వేణు ప్రశ్నించారు. తమకు కూడా చెప్పాలి కదా? అని ఫోన్ లో నిలదీశారు. సీక్రెట్ గా నోటీసు ఏమీ అంటించలేదని, అందరికీ తెలిసేలా అంటించామని సమత చెబుతుండగా.. బెల్లం వేణు ఆగ్రహంతో ఊగిపోయాడు.
తనపై విసుక్కోవడమే కాకుండా.. తీవ్రంగా దూషించాడన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఫోన్ లో తనను ఇష్టం వచ్చినట్లు తిట్టాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వేణు తనతో మాట్లాడిన తీరును సిబ్బందికి వివరిస్తూ బోరున విలపించారు. అతని వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపానికి గురైన సమత.. కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగారు.