బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత రాష్ట్రం వెలుపల తొలిసభను మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాందేడ్ పట్టణంతోపాటు సభా ప్రాంతానికి వెళ్లే దారులన్నీ గులాబీ జెండాలతో నిండిపోయాయి.
ఎయిర్‌పోర్ట్ నుంచి సభావేది వరకు ప్రధాన రహదారుల్లో భారీ హోర్డింగులను ఏర్పాటు చేశారు. దారి వెంట ఏర్పాటు చేసిన బెలూన్లు, స్టిక్కర్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సీఎం కేసీఆర్ హోర్డింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభ సందర్భంగా పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.
ఈ సభకు భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాల్లోని ప్రజలు భారీగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.