మరో సారి హైదరాబాద్ నగరంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వార్ లో పోస్టర్లు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మరక అంటదంటూ..నగర వ్యాప్తంగా అంటించబడ్డ పోస్టర్లు చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.
ఈ నేపథ్యంలో మరో సారి మోడీ సర్కార్ ను కార్నర్ చేస్తూ వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఐదేళ్ళు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఉప్పల్ నారపల్లి ఫ్లై ఓవర్ కనీసం 40 శాతం కూడా పూర్తి కాలేదని.. మోడీ ఇంకెన్నాళ్లు ఈ ఫ్లై ఓవర్ ను కడతారంటూ నిలదీసినట్టుగా ఈ పోస్టర్లలో ఉంది. ఇది మంగళవారం ఉదయం ఫ్లై ఓవర్ పిల్లర్లపై వెలిసాయి.
అయితే మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్లకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అతికించారు. 2018 మే 5 న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్ కు శంకు స్థాపన చేసినట్టుగా కూడా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ ఫ్లై ఓవర్ పని నత్తనడకన సాగుతోందని..5 ఏళ్లు అవుతున్నా.. కనీసం 40 శాతం పని కూడా పూర్తి చేయలేదని పోస్టర్ల రూపంలో తెలియజేశారు.
అయితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోరులో పోస్టర్లు కీ రోల్ ప్లే చేస్తున్నాయి. మోడీ సర్కార్ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో పోస్టర్లను రూపొందిస్తోంది. కవిత ఈడీ విచారణకు హాజరయ్యే రోజు ఉదయాన్నే హైదరాబాద్ నగరవ్యాప్తంగా పెట్టిన పోస్టర్లు బాగా హల్ చల్ చేశారు. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థ చేతిలో ఇరుక్కున్న మంత్రులు బీజేపీ కండువా కప్పుకున్న తరువాత ఎలా కేంద్ర మంత్రులయ్యారనేది తెలియపర్చుతూ.. ఈ పోస్టర్లు, వాల్ పేపర్లను తయారు చేసింద బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ వరుసగా అతికిస్తున్న పోస్టర్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.