ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలోని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వంగవీటి రంగాను స్మరించుకోకుండా ఉండలేమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ మోడలే ఏపీలో కూడా అమలు చేస్తామని తెలిపారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణంలో కేంద్రం సహకారం రావడం లేదని అన్నారు.
దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిందని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీలో ప్రతిపక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సమస్యల పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. చాలా మంది నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు మాతో సంప్రదిస్తున్నారని వెల్లడించారు. ఏపీలో బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తోట చంద్రశేఖర్.