తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్దంగా ఉందని తెలిపారు. అలాగే బీజేపీలో కోవర్టులుండరని..తమది సిద్థాంతం గల పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.
ఇక ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని, కేటీఆర్.. ఆ మాటను తన తండ్రి కేసీఆర్ తో చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ ఇజ్జత్ తీశారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నాయకులను రప్పించి బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు అనేక అబద్ధాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.
కేసీఆర్ చెబుతున్న అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉన్నదని, రైతు బీమా కేసుల్లో 10 వేల మంది రైతులవి ఆత్మహత్యలేనని బండి చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు రైతులను ఎమ్మెల్యేలను చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రతి గింజా కేంద్రమే కొంటున్నా.. తానే కొనుగోలు చేస్తున్నట్టు నమ్మిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు రాని వంద గ్రామాల పేర్లు చెప్తానని, వచ్చే ఐదు గ్రామాల పేర్లు కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురాలేదని, ఆయన బిడ్డ కవిత మాత్రం దుబాయి వెళ్లి డబ్బులు వసూలు చేసుకుంటోందని ఆరోపించారు. తమ పార్టీలో కోవర్టులున్నట్టు ఈటల అనలేదని, అంతా మీడియా వక్రీకరణే అని బండి స్పష్టం చేశారు. మరి బీఆర్ఎస్ నాయకులు బండి సవాల్ పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.