నిత్యం రెండు సార్లు బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు శుభ్రంగా ఉంటాయని మనం చిన్నతనం నుంచి చదువుతూనే వస్తున్నాం. ఇలా చేయడం వల్ల దంతక్షయం రాకుండా ఉంటుంది. నోటి దుర్వాసన, ఇతర దంత సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ప్రస్తుతం అనేక మంది దంతాలను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో అనేక మందికి తెలియకుండానే రోగ నిరోధక శక్తి నశిస్తోంది. అయితే.. దంతాల శుభ్రతకు, శరీర రోగ నిరోధక శక్తికి సంబంధం ఏమిటని.. చాలా మంది సందేహం వ్యక్తం చేయవచ్చు. కానీ ఆ రెండింటికీ సంబంధం ఉంది.. ఎలాగంటారా…
మనం నిత్యం తినే ఆహార పదార్థాల వల్ల నోట్లో బాక్టీరియా పేరుకుపోతుంది. ఇతర సూక్ష్మ జీవులు వచ్చి చేరతాయి. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉండే కార్బొహైడ్రేట్లు, చక్కెరలు మన నోట్లో బాక్టీరియాను పేరుకుపోయేలా చేస్తాయి. అయితే నిత్యం రెండు సార్లు దంతాలను తోముకుంటే.. ఆ బాక్టీరియా నశిస్తుంది. కానీ అలా చేయని పక్షంలో.. దంతాల్లో ఏవైనా పుచ్చిపోయి ఉన్నా.. లేదంటే దంతాల వద్ద చిగుళ్లు పగిలినా.. రక్తం కారుతున్నా.. అవి దృఢంగా లేకపోయినా.. వాటిలోకి నోట్లో ఉన్న బాక్టీరియా వెళ్తుంది. చిగుళ్లలోకి ప్రవేశించే బాక్టీరియా అక్కడి నుంచి రక్తంలోకి చేరుతుంది. దీంతో మన శరీరంలో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
అలా ఇన్‌ఫెక్షన్ రాగానే మన శరీర రోగ నిరోధక వ్యవస్థ స్పందించి.. అందుకు అనుగుణంగా సి-రియాక్టివ్ ప్రొటీన్ (సీఆర్‌పీ)ని లివర్ నుంచి విడుదల చేస్తుంది. రక్తంలో సీఆర్‌పీ ఉందంటే.. మన శరీరం ఇన్‌ఫెక్షన్ కారణంగా వాపునకు గురైందని అర్థం. ఈ క్రమంలో నోట్లో నుంచి రక్తంలోకి బాక్టీరియా నిరంతరం వచ్చి చేరుతుంటే.. నిరంతరం శరీరం ఇన్‌ఫెక్షన్‌కు గురవుతూనే ఉంటుంది. దీంతో నిరంతరం సీఆర్‌పీ విడుదలవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో సుదీర్ఘకాలం పాటు ఇలా జరిగితే శరీరంలో సీఆర్‌పీ స్థాయిలు అధికమవడమే కాదు, శరీర రోగ నిరోధక శక్తి కూడా పూర్తిగా నశిస్తుంది. దీంతో గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక దీన్ని నివారించాలంటే.. నిత్యం దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి.
నిత్యం దంతాలను రెండు సార్లు తోమడంతోపాటు ఒకసారి ఫ్లాస్ (దారంతో దంతాల మధ్య శుభ్రం చేయడం) చేయాలి. అలాగే కార్బొహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. దీంతోపాటు నిత్యం సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఏడాదిలో కనీసం రెండు సార్లయినా డెంటల్ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు ఉంటే ఆ మేరకు మందులు వాడాలి. అయితే సాధారణంగా అప్పుడే దంతాలు వచ్చే చిన్నపిల్లలకు, పుచ్చు పళ్లు ఉన్నవారికి, చిగుళ్ల సమస్యలు ఉన్నవారికి ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దీంతో ప్రాణాంతకమైన గుండె జబ్బులు రాకుండా, శరీర రోగ నిరోధక శక్తి నశించకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.