ఏది మంచి, ఏది చెడో ఇంకా తెలియని వయస్సున్న చిన్నారులు వారు. తెలిసీ తెలియక ఓ తోటలో మామిడి పిందెలు తెంపారు. అంతే ఆగ్రహించిన తోట కాపలాదారుల తాము మనుషులం అనే విషయం మరిచిపోయారు. ఇద్దరు చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించారు. చేతులు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. పశువుల పేడ తినిపించి పైశాచికానందం పొందారు. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో చోటు చేసుకుంది.
బొత్తలతండాకు చెందిన బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారుగా ఉంటున్నారు. గురువారం తొర్రూరుకు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మామిడి తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్ పరుగున వచ్చి చిన్నారుల చేతులు కట్టేసి చితకబాదాడు. అంతటితో ఆగకుండా పేడ నోట్లో కుక్కి మృగాడిలా వ్యవహరించాడు.
చిన్నారులను వేధిస్తున్న ఘటనను తోట పక్క నుంచి వెళ్తున్న తండా వాసి ఒకరు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.