రాజధాని భాగ్యనగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పాతకక్ష్యలతో ఒకరు, ఆస్తి కోసం మరొకరు.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఇంకొకరు.. ఇలా రోజుకో చోట హత్యాఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నగరంలోని లాలాగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి కొందరు దుండగులు దారుణంగా పొడిచి చంపారు. తెల్లవారు జామును మృత దేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఎక్కడో నిర్మానుష్య ప్రదేశాల్లో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్టు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కాగా.. లాలాగూడకు చెందిన సబ్బీర్ అనే వ్యక్తి 2017లో దారుణ హత్యకు గురయ్యాడు. ఆ హత్యకేసులో మృతుడు అఫ్సర్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసు విషయంలో శిక్ష అనుభవించిన అఫ్సర్ ఇటీవలే జైలు నుండి విడుదలైనట్టు పోలీసులు తెలిపారు.
పాత కక్షల నేపథ్యంలో సబ్బీర్ బంధువులే హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో అతనికన్న కాంటాక్టులు, అతని ఫోన్ కాల్స్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు.